సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సినీ థ్రిల్లర్ ను తలపించేలా మలుపుల మీద మలుపులు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. వివేకా హత్య జరిగి దాదాపు నాలుగన్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ నిందితులకు శిక్ష పడకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంచుల దాకా వెళ్లి ముందస్తు బెయిల్ పై బయటపడడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసు గురించి దేశపు అత్యున్నత ధర్మాసనం సంచలన కామెంట్లు చేసింది.
వివేకా మర్డర్ కేసు కీలకమైనదని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ విచారణను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది. అంతేకాదు, వివేకా హత్య కేసు వివరాలు, డైరీని సీల్డ్ కవర్ లో తమకు అందించాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై కౌంటర్ ను కూడా సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ల విచారణలు ఒకేసారి వింటామని స్పష్టం చేసింది.
గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలను వేరుగా వినాలన్నఅభ్యర్థనను సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ ఇద్దరి బెయిల్ పిటిషన్లను జత చేసిన సుప్రీం కోర్టు…ఒకేసారి వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గంగిరెడ్డికి తక్షణమే బెయిల్ మంజూరు చేయాలన్న అతడి తరఫు లాయర్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్యకేసుకు సంబంధించిన బెయిల్ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోలని స్పష్టం చేసింది. ఎన్నో సాక్ష్యాలను, ఆధారాలను పరిశీలించాల్సి ఉంటుందని, బెయిల్ కోసం వేచి ఉండాల్సిదేనని తేల్చి చెప్పింది. గంగిరెడ్డికి జూన్ 30న బెయిల్ ఇవ్వాలని చాలా నెలల క్రితమే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్టే ఉత్తర్వులు సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతాయని తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.