వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారం చాలా కాలంగా చర్చనీ యాంశమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును జూన్ 30లోగా ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఆ తేదీ దాటిన వెంటనే గంగిరెడ్డి బెయిల్ తీసుకోవచ్చు అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి.
సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కూడా గంగిరెడ్డి విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇవేం ఉత్తర్వులని హైకోర్టు తీరును ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో జస్టిస్ నరసింహ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటును ప్రపంచంలో ఎనిమిదో వింతగా సీబీఐ తరపు న్యాయవాది అభివర్ణించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు ఒకరోజు గడువు కావాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అదే సమయంలో గంగిరెడ్డి తరఫు లాయర్ కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం పై విచారణ వాయిదా పడింది. దీంతో, సునీత పిటిషన్ తో పాటు గంగిరెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్లను కలిపి ఈ నెల 26వ తేదీన విచారణ జరపాలని జస్టిస్ నరసింహ ధర్మాసనం నిర్ణయించింది.