యావత్ భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో కరోనా రోగులకు ఆక్సిజన్ అందక చనిపోయిన ఉదంతంపై సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం విదితమే. అయితే, ఢిల్లీకి తక్కువ మోతాదులో కేంద్రం ఆక్సిజన్ నిల్వలు పంపిందని కేజ్రీవాల్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిపై సుప్రీం విచారణ జరిపింది.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గురువారం నాడు ఆదేశించింది. అయితే, గురువారం అర్ధరాత్రికి 527 మెట్రిక్ టన్నులు, శుక్రవారం ఉదయం 9 గంటలకు మరో 89 టన్నులు ఆక్సిజన్ అందగా.. మరో 16 మెట్రిక్ టన్నులు మార్గమధ్యలో ఉందని ఢిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టుకు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని తాము స్పష్టంగా చెపుతున్నామని… తాము కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీకి ఆక్సిజన్‌ను ఇప్పటికి కూడా కేంద్రం సరఫరా చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందని వ్యాఖ్యానించింది. తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాల్సిందేని స్పష్టం చేసింది.
రాష్ట్రాలకు కేంద్రం ద్వారా ఆక్సిజన్ కేటాయింపు, పంపిణీ ఎంత పారదర్శకంగా జరుగుతుందో దేశం ముందు ఉంచాలని ఆదేశించింది. దీంతోపాటు, ప్రతి రాష్ట్రానికి సరఫరా అవుతున్న ఆక్సిజన్ పై ఎక్స్ పర్ట్ ప్యానల్ ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది.కోవిడ్-19 మహమ్మారి రెండో దశలో ఉన్నామని, రాబోయే థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు కేంద్రం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించింది.