ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆయన సతీమణి టీఎన్ విజయలక్ష్మిలపై గతంలో సీబీఐ ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, కాబట్టి దీనిని కొట్టి వేయాలని సురేశ్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…ఆ ఎఫ్ఐఆర్ ను తోసిపుచ్చింది.
సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో లోపాలు ఉన్నాయని, మరోసారి ప్రాథమిక విచారణ జరపాలని సీబీఐ అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా సురేష్ దంపతులకు షాకిచ్చింది. ఈ కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనికి సంబంధించిన తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐకి అనుమతించింది. అయితే, ఈ కేసులో మరోసారి ప్రాథమిక విచారణ అవసరం లేదని, కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ సాగించాలని ఆదేశాలు ఇచ్చింది.