దొరికినకాడికి అప్పులు చేయడం…పప్పు బెల్లాలు పంచినట్లు పంచేయడం…ఆఖరికి చేతిలో చిప్ప పట్టుకొని కొత్త అప్పుల కోసం సరికొత్త ఐడియాలు వేయడం…ఇది మూడేళ్ల జగన్ పాలనలో బేసిక్ ఫార్ములా. అయితే, అప్పులు పుట్టడం ఆగడంతో జగనన్న కొత్త ప్లాన్ వేసి…ఒక శాఖకు కేటాయించిన నిధులను మరో శాఖకు బదిలీ చేయడం, సంక్షేమ పథకాలకు వాడడం వంటి నెవర్ బిఫోర్ ఐడియాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
ఈ కోవలోనే కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు కేటాయించిన ఎన్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ వ్యవహారంపై గతంలోనే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై నేడు మరోసారి విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతాలకు మళ్లించిన రూ.1100 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిధులను వెనక్కి ఇచ్చేయాలంటూ జగన్ సర్కారును సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేకాదు, నిధులు చెల్లించేందుకు 2 వారాల డెడ్ లైన్ ను సుప్రీం విధించింది.
దీంతో, చేసేదేమీ లేక సుప్రీంకోర్టు నిర్ణయం శిరసావహిస్తామని, నిధులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు వెల్లడించారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ కు కొన్ని వందల కోట్ల నిధులు కేటాయించారు. అయితే, వాటిలోనుంచి జగన్ సర్కారు రూ.1100 కోట్లు దారిమళ్లించింది. ఆ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాకలు కాగా… దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సీఎస్ కు సుప్రీీం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీం…రూ.1100 కోట్ల నిధులు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలివ్వడంతో జగన్ కు షాక్ తగిలినట్లయింది.