కరోనా సమయంలో ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఏపీ సీఎం జగన్ గొప్పలు చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలోనే జనానికి అత్యున్నత వైద్య సేవలు అందించామని, కరోనా మృతుల కుటుంబాల పరిహారం విషయంలోనూ తాము అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని జగన్ , వైసీపీ నేతలు డబ్బా కొట్టుకున్నారు. కట్ చేస్తే….కరోనా బాధితులకు పరిహారం అందించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.
ఏపీలో కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడంలేదంటూ పల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు….ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నష్టపరిహారం అందించే అంశాన్ని పరిశీలించాలంటూ ఏపీ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఏపీలో 14 వేల మందికి పైగా కరోనాతో మృత్యువాతపడ్డారు. చాలామంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. అలా అనాధలుగా మారిన పిల్లలు దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పరిహారం అందడం లేదని పల్లా శ్రీనివాసరావు పిటిషన్ వేశారు.