టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని సీఎం జగన్ టార్గెట్ చేశారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ విషయంలో జగన్ ఆదేశాలతోనే అధికారులు అయ్యన్నపై కక్షగట్టారని ఆరోపణలు వచ్చాయి. జలవనుల శాఖకు చెందిన 16 సెంట్ల భూమిని అయ్యన్న కబ్జా చేశారంటూ అయ్యన్నపై గతంలో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు.
నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు తన ఇంటిని నిర్మించే క్రమంలో ఎన్ఓసి కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను ఫోర్జరీ చేశారని ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఆయనపై సెక్షన్ 467 వంటి తీవ్రమైన సెక్షన్ ప్రకారం విచారణ జరుపుతామంటూ సిఐడి అధికారులు కోరారు. దీంతో, తనపై నమోదైన భూ ఆక్రమణ కేసు కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో అయ్యన్న పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో సెక్షన్ 467 వర్తించదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అయ్యన్నకు 41ఏ నోటీసులు జారీ చేయవచ్చని, సిఐడి దర్యాప్తు జరుపుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొద్ది రోజుల క్రితం ఆదేశించింది.
అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ క్రమంలోనే ఆ ఫోర్జరీ కేసు వ్యవహారంలో అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు దేశపు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫోర్జరీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు పక్కనబెట్టింది.
ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయొచ్చని.. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగానే విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది.