ఈనాడు గ్రూప్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు నిర్వహిస్తున్న మార్గదర్శి ఫైనాన్స్ సంస్థలో కుంభకోణం జరిగిందంటూ గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మార్గదర్శి సంస్థపై, ఆ సంస్థ ఎండీ రామోజీరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, గతంలో ఆ కేసు నుంచి రామోజీరావును డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఉండవల్లి మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్ బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించారని, డిపాజిట్లు వెనక్కి ఇచ్చారన్న క్లైమ్ లో కూడా చాలా తప్పులు ఉన్నాయని ఉండవల్లి ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మార్గదర్శి దోషిగా తేలితే దాదాపు 7వేల కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని, 2 నెలల జైలు శిక్ష కూడా పడే సూచనలున్నాయని ఉండవల్లి అన్నారు. ఈ క్రమంలోనే ఆ కేసులో ఏపీ సర్కార్ ను కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే మార్గదర్శి వ్యవహారంలో దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై గతంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత రామోజీరావు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే ఈ మూడు పిటిషన్ లను సుప్రీంకోర్టు విచారణ జరిపి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంతో పాటు రామోజీరావుకు కూడా సుప్రీం నోటీసులు పంపిందని ఉండవల్లి వెల్లడించారు.
అంతేకాదు నాలుగు వారాల్లో ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని కూడా ఉండవల్లి తెలిపారు. రామోజీరావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ కొటేషన్ పై తెలంగాణ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు పంపిందని ఉండవల్లి చెప్పారు. గతంలో ఈ పిటిషన్ లో ఇంప్లీడ్ కావాలని తాను కోరినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. కానీ, తాజా నోటీసుల నేపథ్యంలో తప్పక స్పందించాల్సి ఉంటుందని ఉండవల్లి అన్నారు.