అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో జగన్ తో పాటు సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన వైనం సంచలనం రేపుతోంది. ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను తెలంగాణ నుంచి ఇంకో రాష్ట్రానికి మార్చాలని, తెలంగాణ సీబీఐ కోర్టులో విచారణలో జాప్యం జరుగుతోందని రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
371 సార్లు జగన్ కేసులను సీబీఐ కోర్టు వాయిదా వేసిందని, జగన్ ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు ఇచ్చిందని పిటిషన్ లో రఘురామ పేర్కొన్నారు. జగన్ తరఫు లాయర్లు వందలాది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారని రఘురామ తరఫు లాయర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రఘురామ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. జగన్ పై కేసుల విచారణలో జాప్యానికి గల కారణాలు వెల్లడించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. రఘురామ పిటిషన్ పై తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.