మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు.. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్నట్లుగా ప్రచారం జరిగిన వేళ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్ ముందస్తు బెయిల్ పొందారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వివేకా కుమార్తె సునీత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమే స్వయంగా వాదనలు వినిపించారు. అయితే.. సాంకేతిక అంశాలున్న నేపథ్యంలో అడ్వొకేట్ను పెట్టుకోవాలని సునీతకు సూచించగా.. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ఆమెకు సాయం అందించిన విషయం తెలిసిందే.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తుబెయిల్ ను ఆమె సవాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం అవినాశ్ కు నోటీసుల్ని జారీ చేసింది. సునీత వేసిన పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను జులై మూడుకు వాయిదా వేసింది. సునీతారెడ్డి వేసిన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్.. జస్టిస్ ఎంఎం సుందరేష్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణలు జరిపింది.