మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. దానికితోడు ఈ కేసులో సాక్షులను నిందితులు, అనుమానితులు బెదిరిస్తున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి అప్రువర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని పదే పదే మొత్తుకుంటున్నా…ప్రభుత్వం, పోలీసులు అతడికి రక్షణ కల్పించకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో సీబీఐ జోరు పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ ప్రకారం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పేనని సీబీఐ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. సాక్షుల ప్రాణాలను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందేనని ఆయన వాదనలు వినిపించారు.
ఈ కేసు నిందితులతో పాటు స్థానిక పోలీసులపై కూడా సీబీఐ తరఫు న్యాయవాది సంచలన ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిందితులు, స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, మూకుమ్మడిగా కేసు విచారణను ముందుకు సాగనివ్వడం లేదని ఆరోపించారు. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు గంగిరెడ్డికి షాకిచ్చింది. సీబీఐ వాదనలపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్ 14కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు, ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు నుంచి పొరుగు రాష్ట్రం హైకోర్టుకు బదిలీ చేయాలన్న వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్ పై కూడా సుప్రీం కోర్టు విచారణ మొదలుబెట్టిన సంగతి తెలిసిందే.