ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కొంతకాలంగా ఉన్న సస్పెన్స్ వీడింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ దేశపు అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏపీలో ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ల విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఉద్యోగ సంఘాలపై జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాల వ్యవవహార శైలి చట్ట విరుద్ధంగా ఉందని, తమ విధులు నిర్వహించకుండా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం ప్రమాదకరమైన ధోరణికి సంకేతమని జస్టిస్ కౌల్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల ప్రవర్తన పూర్తి అసంతృప్తిగా ఉందని, దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. ఎక్కడైనా ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో ఎన్నికలు కావాలని చెప్పిన విషయాన్ని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు. ఎస్ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికల నిర్వహణ అంశం తెరపైకి వచ్చిన ప్రతీసారి వాయిదా కోసం కోర్టుకు వస్తున్నారని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.
అంతకుముందు, జగన్ సర్కార్ తరఫున ఈ పిటిషన్లపై సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని గుర్తు చేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో పోలీసులు వ్యాక్సిన్ ను భద్రపరిచే విధుల్లో ఉన్నారని, అందువలన ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి కూడా ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమని, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనలు విన్న జస్టిస్ కౌల్ ధర్మాసనం…ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని తీర్పునిచ్చింది. సుప్రీం తాజా తీర్పుతో జగన్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా, ఏపీ గవర్నర్ తో భేటీ అయ్యిేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, వారెవరికీ గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో గవర్నర్ తో వారి భేటీ ఉంటుందా ఉండదా అన్నది తేలాల్సి ఉంది.