పోక్సో చట్టంలో ఇంత పెద్ద లోపం ఉందా?

ఒక అమ్మాయి వద్దంటే.. వద్దన్నట్లే. దానికి మరే మాటలు ఉండవు. ఆమె ఇష్టానికి భిన్నంగా నో చెప్పటానికి ఆమెకు ఉన్న హక్కు గురించి ఆ మధ్య విడుదలైన ఒక బాలీవుడ్ చిత్రం ఒక్కమాటలో చెప్పేయటం తెలిసిందే. లైంగిక వేధింపులు ఎలా జరిగినా వేధింపే. అమ్మాయిల శరీర భాగాల్ని తడమటం.. ఆమె ఇష్టానికి భిన్నంగా వ్యవహరించటం నేరం అనుకుంటాం. కానీ.. ఫోక్సో చట్టంలోని లోపాన్ని బయటపెట్టినట్లైంది బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చూసినప్పుడు. సంచలనంగా మాత్రమే కాదు.. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చర్చకు అవకాశం ఇచ్చేలా చేసింది బాంబే హైకోర్టు తీర్పు.
ఫోక్సో చట్టం కింద ఒక కేసు నమోదు కావటం.. దానికి కింది కోర్టు నిందితుడ్ని దోషిగా తేలుస్తూ.. మూడేళ్ల జైలుశిక్షను విధించారు. దీనిపై అప్పీలు చేసుకున్న సదరు కేసుపై విచారించిన బాంబే హైకోర్టు.. నిందితుడి జైలుశిక్షను మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తూ తీర్పును ఇచ్చింది. దీనికి కారణం...సదరు వ్యక్తిపై నమోదు చేసిన ఫోక్సో చట్టంలోని లోపమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


పన్నెండేళ్ల బాలిపై లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 39 ఏళ్ల వ్యక్తికి చెందిన కేసులో నాగపూర్ బెంచ్ కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం నిందితుడికి కింది కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఏడాదికి మారుస్తూ తీర్పును ఇచ్చారు. ఇంతకూ ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2016లో సతీష్ అనే వ్యక్తి బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశ చూపించి.. ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయటంతో ఆ పాప తల్లి అక్కడకు వచ్చింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేశారు. దిగువ కోర్టు ఈ ఉదంతంలో సతీశ్ ను దోషిగా తేలస్తూ పోక్సో చట్టం కింద శిక్ష విధించింది. ఈ కేసును హైకోర్టుకు అప్పీలు చేసుకోగా.. బాలిక వక్ష స్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా? దుస్తుల లోపలకుచేయి పెట్టాడా? అన్న వివరాలు లేనందున.. దీన్ని లైంగిక వేధింపుల కేసు కింద లెక్కలోకి తీసుకోలేమని పేర్కొంటూ ఏడాది జైలుకు పరిమితం చేశారు.


ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చర్చకు తెర తీయటం ఖాయం. ఎందుకంటే.. ఈ తీర్పులో ప్రస్తావించిన అంశాలే.  లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించటానికి ఉద్దేశించిన పోక్సో చట్టంలోని సెక్షన్లలో కొన్ని లోపాల్ని ఈ కేసు బట్టబయలు చేసింది. అదెలానంటే.. లైంగిక వేధింపులకు గురైనట్లు చెబుతున్న బాలిక వక్ష స్థలాన్ని దుస్తుల పై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని చట్టం చెబుతోందని పేర్కొంది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి.. లేదంటే దుస్తుల లోపలకు చేయి పెట్టి నేరుగా తాకితేనే దాన్ని లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. దీంతో.. నిందితుడు జైలుశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కలిగింది. మరి.. ఇప్పటికైనా ఫోక్సో చట్టానికి మార్పులు చేస్తారా? అన్నది ప్రశ్న.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.