టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని అక్రమ కేసు పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై రాజకీయ కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబుపై జగన్ అక్రమ కేసులు బనాయించారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయించారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. అయితే, చంద్రబాబుకు ఏపీ హైకోర్ట్ అప్పట్లో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఆ బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో ఆనాటి వైసీపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది.
కనుమ పండుగనాడు చంద్రబాబుకు సుప్రీం కోర్టు తీపి కబురు చెప్పింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ కేసులో ఆల్రెడీ చార్జిషీట్ దాఖలైందని, కనుక, బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోబోమని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణకు చంద్రబాబు సహకరించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో చంద్రబాబుకు భారీ రిలీఫ్ లభించినట్లయింది.