మైనింగ్ కింగ్ గా పేరుమోసిన గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుల వ్యవహారంలో జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న గాలి జనార్ధన్ రెడ్డి జైలు శిక్ష అనుభవించిన తర్వాత ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఈ క్రమంలోనే తన బెయిల్ నిబంధనలు సడలించాలని గాలి జనార్ధన్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వ్యక్తిగత కారణాలతో మూడు నెలలపాటు బళ్లారిలో ఉండేందుకు అనుమతించాలని కూడా సుప్రీంకోర్టును గాలి జనార్థన్ రెడ్డి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్లపై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. బెయిల్ నిబంధనలు తొలగించాలంటే గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాదు, బళ్లారిలో కేవలం నెల రోజులుపాటు మాత్రమే ఉండేందుకు సుప్రీం అనుమతించింది.
గాలి జనార్థన్ రెడ్డి కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని గతంలోనే అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ఈ కేసులో ట్రయల్ మొదలుబెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టును దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను ఇకపై రోజువారీగా చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు, 6 నెలల లోపు ఈ కేసు విచారణ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.