నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎంపీ హోదాలో ఉన్న రఘురామను ఓ సాధారణ వ్యక్తిలా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, తనను పోలీసులు కొట్టారని రఘురామ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే రఘురామ బెయిల్ పిటిషన్ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రఘురామ సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో రఘురామ బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను శుక్రవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించి జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ బి. ఆర్. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది.
రఘురామకృష్ణరాజుకు హైదరాబాద్లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ విషయంపై అధికారికంగా ఆదేశాలు వెలువడే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, రఘురామ బెయిల్ పిటిషన్పై సమాధానమివ్వాలని, గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్ సర్కార్ ను సుప్రీం ఆదేశించింది