ఇప్పటివరకు వ్యవస్థలు తమ పరిమితులు మీరకుండా.. పరిధులు దాటకుండా వ్యవహరించటమే కాదు.. మరో వ్యవస్థ మీద అదే పనిగా కాలు దూయటానికి ఇష్టపడేవి కావు. అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు న్యాయస్థానాలు అంతో ఇంతో సరైన సమాధానాలు ఇస్తున్నాయి. తాజాగా అలాంటి తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అంతేకాదు.. మీడియా స్వేచ్ఛ మీదా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో దానికున్న పరిధి విషయాన్ని స్పష్టమైన వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.
గతంలో ఎప్పుడూ లేని రీతిలో మీడియా మీద పిడివాదనను వినిపించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు నిర్వహించటం మినహా.. మిగిలిన విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోని ఈసీ.. తన తీరుకు భిన్నంగా ఇటీవల వ్యవహరించటం తెలిసిందే. కరోనా వేళ.. ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈసీ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. తాను చేయాలనుకుంటే ఎంతో చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అలాంటివేమీ లేకుండా చేసిన తీరుపై తీవ్ర మండిపాటు వ్యక్తమైంది. ఈ సందర్భంగా తమిళనాడు హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యల్ని మీడియా ప్రముఖంగా ముద్రించటంపై ఈసీ అగ్గిలం మీద గుగ్గిలమైంది.
‘‘మీ నిర్లక్ష్యం వల్లే కేసులు పెరిగాయి.. మరణాలు చోటు చేసుకున్నాయి. విచ్చలవిడిగా ఎన్నికల ప్రచార సభలకు.. ర్యాలీలకు అనుమతించారు.. మీది బాధ్యతారహిత సంస్థ. మీపై మర్డర్ కేసు పెట్టాలి’’ అంటూ మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యల్ని మీడియా ప్రచురించిన వైనంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం తాజాగా తీర్పును ఇచ్చింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని తొలగించలేమని చెప్పటమే కాదు.. విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేయకుండా కోర్టుల్ని నిరోధించలేం.. ఆ వ్యాఖ్యల్ని ప్రచురించకుండా మీడియాను ఆపలేం.. ఇలాంటి ఆంక్షలు విధించటం తిరోగమన చర్యే అవుతుందని సుప్రీం పేర్కొంది.
కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని.. భావ ప్రకటన స్వేచ్ఛ మీడియాకు వర్తిస్తుందని పేర్కొంది. కోర్టులో జరిగే విచారణ ప్రక్రియను ప్రచురించొచ్చని స్పష్టం చేసింది. విచారణ సందర్బంగా జడ్జిలు చేసే మౌఖిక వ్యాఖ్యలకు తగిన ఆధారాలు లేవన్న ఈసీ వాదనను తోసిపుచ్చింది. నిజానికి.. ఇంతకాలం వరకు ఈసీ మీడియాతో అనుసంధానం చేసుకొని సమర్థవంతంగా ఎన్నికల్ని నిర్వహించేందుకు ప్రయత్నించేది. అందుకు భిన్నంగా మీడియాకు పరిమితులు పెట్టాలన్న ఈసీ ప్రయత్నం సుప్రీం పుణ్యమా అని తేలిపోయిందని చెప్పక తప్పదు.