గుజరాత్ అల్లర్ల వేళ సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారికి ఇటీవల ఊరట లభించడం.. వారిని జైలు నుంచి విడుదల చేయడం.. తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. అయితే.. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. ఇక్కడ కూడా చుక్కెదురైంది.
ఈ కేసులో దోషుల ముందస్తు విడుదలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2002లో గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన దుండగులు ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు.
ఈ కేసులో 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందికి జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా దాన్ని పరిశీలించా లని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ సర్కార్ దోషుల కు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.
అంటే, వారిని బయటకు విడుదల చేయొచ్చన్నమాట. ఈ ఏపథ్యంలో సర్కారు సిఫారసుల మేరకు వాటిని కోర్టుకు సమర్పించగా.. 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే 11 మంది ఇటీవల జైలు నుంచివిడుదలయ్యారు. అయితే.. వీరిని బీజేపీ కార్యకర్తలు, నాయకులు కొందరు.. ఘనంగా పూల గుచ్ఛాలతో సత్కరించి.. ఆహ్వానించడం కూడా వివాదానికి దారితీసింది. ఇక, ఇప్పుడు గతంలో ఇచ్చిన తీర్పును సవరించేది లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.