వివేకా మర్డర్ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయమనుకుంటున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దంటూ మధ్యంత ఉత్తర్వులను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అవినాష్ రెడ్డిమధ్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ అత్యవసర విచారణ చేయాలని కోరారు.
ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు తాజాగా నేడు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే వివేకా మర్డర్ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దు అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సునీతా రెడ్డికి అనుకూలంగా దేశపు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
అంతేకాకుండా, ఈ కేసులో సీబీఐ విచారణ గడువును జూన్ 30 వరకు సుప్రీం కోర్టు పొడిగించడం సంచలనం రేపుతోంది. వాస్తవానికి ఏప్రిల్ 30 లోపు ఈ కేసు విచారణ ముగించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక, విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వంటి చర్యలు సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని అభిప్రాయపడింది. ఇటువంటి ఉత్తర్వులు తప్పుడు సంప్రదాయాలకు దారితీస్తాయని అసహనం వ్యక్తం చేసింది.