అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పొంగూరు నారాయణపై ఏపీసీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో సిఐడి అధికారులు చర్యలు చేపట్టక ముందే నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని, ఈ క్రమంలోనే తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు.
నారాయణ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అందుకు సానుకూలంగా స్పందించింది. నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చింది.
నారాయణ ముందస్తు బెయిలు రద్దు చేయడం కుదరదని ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై దేశపు అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రతి చిన్న విషయానికి సుప్రీంకోర్టు తలుపు తడితే ఎలా అంటూ ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మీ రాజకీయ ప్రతీకారంలో మమ్మల్ని భాగస్వాములను చేయొద్దు అంటూ జగన్ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణ ముందస్తు బెయిల్ ను చిత్తూరు జిల్లా కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.