టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల వ్యవహారం…అసెంబ్లీ ఎన్నికల పోరుకు తీసిపోని విధంగా రాజకీయ రంగుపులుముకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండడంతో ఉత్కంఠ ఏర్పడింది. దీనికి తోడు లోకల్, నాన్ లోకల్ అన్న కాన్సెప్ట్ పై ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయిందని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది.
మొత్తం కలిపి దాదాపుగా వెయ్యి ఓట్లున్న ‘మా’ లో పోల్ అయ్యే ఐదారొందల ఓట్ల కోసం ఇంతమంది పోటీపడుతున్నారని సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అన్న సంగతి తెలిసిందే. అసలు, ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే…ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రకటించడం ఏమిటని కోటా అసహనం వ్యక్తం చేశారు. దీంతో, ప్రకాష్ రాజ్ కు కోటా వ్యతిరేకంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక, ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ వస్తున్న కామెంట్లపై వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ వంటి వ్యక్తులు స్పందించారు. ప్రకాష్ రాజ్ కు మద్దతుగా వర్మతోపాటు మెగా బ్రదర్ నాగబాబుతోపాటు మరికొందరు మాట్లాడారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకలేనని సుమన్ అన్నారు.
లోకల్-నాన్‌లోకల్ అనే కాన్సెప్ట్ అర్థరహితమని సుమన్ అన్నారు. వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని నాన్ లోకల్ కాన్సెప్ట్ పై సుమన్ కొత్త భాష్యం చెప్పారు. సుమన్ తాజా కామెంట్లను బట్టి ప్రకాశ్‌రాజ్‌కు సుమన్ పరోక్షంగా మద్దతు ప్రకటించినట్టేనని అనుకుంటున్నారు.