ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి అధికార టీఆర్ఎస్ ఆడింది ఆటగా సాగింది. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన కేసీఆర్ తనకు ఎదురులేకుండా చూసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో కూడా బలమైన నాయకత్వం లేకపోవడంతో ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టి కేసీఆర్‌కు సవాలు విసిరే నేతలు కనిపించలేదు. కానీ గతేడాది నుంచి ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు వేడి రగుల్చుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఆక్టివ్ కావడంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు మంచి యాక్షన్ సినిమాను తలపిస్తున్నాయి. తొడ కొట్టడాలు.. సవాళ్లు.. సెంటిమెంట్లతో ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్న నేతలు రాష్ట్రంలో రాజకీయ వాతావారణాన్ని నిప్పుల కొలిమిగా మార్చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గతేడాది వరకూ సీఏం కేసీఆర్‌కు ఎదురునిలిచే ప్రతిపక్ష నాయకుడు కనిపించలేదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కేసీఆర్‌కు ఎదురు నిలిచారు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంపికైన రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు.
ప్రధాన పార్టీలకు చెందిన ఈ ఇద్దరు నేతలు కేసీఆర్ లక్ష్యంగా అడుగులు వేస్తుండడంతో తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి తొలిసారిగా రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి కొనసాగుతుండగానే.. మరోవైపు రేవంత్, బండి సంజయ్ తమ దూకుడుతో అధికార ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎవరికి వారు తమదైన జోరుతో ముందుకు సాగుతున్నారు.
ఇక రేవంత్ రెడ్డి అయితే అసలు తగ్గట్లేదు. టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన ఆయన రాజకీయ కాకను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఇక రేవంత్ ఆరోపణలకు సమాధానం ఇచ్చే క్రమంలో మల్లారెడ్డి వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ కూడా రాజీనామా చేయాలని ఎన్నికల్లో ఇద్దరం నిలబడితే ఎవరు గెలుస్తారో తెలుస్తుందని తొడగొట్టి మరీ మల్లారెడ్డి సవాలు చేశారు. నోటికి ఇష్టమొచ్చినట్లు రేవంత్‌పై విరుచుకుపడ్డారు.
మల్లారెడ్డి వ్యాఖ్యలకు రేవంత్ కూడా అదే స్థాయిలో తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి సగం జోకర్ సగం బ్రోకరని సెమీఫైనల్ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడి మీద గెలిచానని ఇక ఇప్పుడు ఫైనల్లో కేసీఆర్ రాజీనామా చేస్తే గజ్వేల్‌లో పోటీకి సిద్ధమని రేవంత్ సవాలు విసిరారు. మరోవైపు ఈ నాయకుల మధ్య మాటల యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర మొదలెట్టిన బండి సంజయ్ మళ్లీ వేగం అందుకున్నారు. కేసీఆర్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తోన్న ఆయన మాటల్లో పదును పెంచారు.
హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని దేశంలో 80 శాతం ఉన్న హిందువుల కోసం ఎంతకైనా తెగిస్తామని దేశద్రోహుల పార్టీ ఎంఐఎంను తరిమి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ మరోసారి సెంటిమెంటును రగిల్చే వ్యూహానికి తెరతీశారని రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు. మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తును ఎండగట్టి హిందువుల్లో కేసీఆర్‌ను విలన్‌గా చిత్రీకరించడమే లక్ష్యంగా సంజయ్ సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది.