హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడో సిత్రమైన పరిస్థితి నెలకొంది. ముందు వెనుకా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.
ఏం చేసినా నడిచిపోతుందన్నట్లుగా పరిస్థితి మారింది.
ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి విషయంలో చర్యలు తీసుకునే కన్నా.. రోడ్డు పక్కన ఆపి ఉంచే వాహనాల మీద చలానాలతో ప్రతాపం చూపే పోలీసింగే ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది.
ఇందుకు తగ్గట్లే ఇటీవల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న మూడు ఘటనలు చూస్తే.. మహానగరంలో ర్యాష్ డ్రైవింగ్ ఎంతలా పెరిగిందన్న విషయం ఇట్టే అర్థమవుతోంది.
ఎస్ఐ పరీక్ష రాసేందుకు నగరానికి చెందిన వికారాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ అనిల్ గౌడ్ సిటీకి వచ్చారు.
స్నేహితుడితో కలిసేందుకు బైక్ మీద బయలుదేరారు. అడ్రస్ కోసం బైక్ మీద వెళుతున్న వారిపైకి ఒక కారు దూకుడుగా దూసుకువచ్చింది.
దీంతో.. ఇలా నడిపితే ఎలా? అంటూ ప్రశ్నించినంతనే కారులో నుంచి దిగిన జునైద్ అనే యువకుడు కానిస్టేబుల్ మీద దాడి చేశాడు.
కాసేపటికి తన స్నేహితులు తన్వీర్.. ఇతరులను అక్కడకు తీసుకొచ్చి కానిస్టేబుల్ మీద దాడి చేయటం సంచలనంగా మారింది.
ఈ ఉదంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మల్కాజిగిరిలో కారులో ఇంటికి వెళుతున్న లాయర్ పై ఇద్దరు దాడికి పాల్పడ్డారు.
ఈసీఐఎల్ కు చెందిన లాయర్ కాంతారావు కారులో వెళుతున్నారు.
కుషాయిగూడ డిపోసమీపానికి రాగానే.. ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు డిపో నుంచి టూ వీలర్ మీద వస్తూ.. ర్యాష్ డ్రైవింగ్ తో కారును ఢీ కొని కిందపడ్డారు.
వారిని పైకి లేపే ప్రయత్నం చేసిన కారు డ్రైవ్ చేస్తున్న లాయర్ పై విచక్షణ రహితంగా దాడి చేయటం గమనార్హం.
మరో ఉదంతంలో వాహనాన్ని నెమ్మదిగా డ్రైవ్ చేయాలన్న మాట చెప్పినందుకు ఒక బాలుడు.. మరో యువకుడు కలిసి ఇద్దరిపై దాడికి పాల్పడిన వైనం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బైక్ మీద వెళుతున్న వారు.. నడుచుకుంటూ తగిలించుకుంటూ వెళ్లారు.
నెమ్మదిగా నడపొచ్చు కదా? అంటూ ప్రశ్నించిన పాపానికి.. సదరు బాలుడు.. అతడితో ఉన్న యువకుడు ముక్తార్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడటమేకాదు.. కత్తితో గాయపరిచిన వైనం చోటు చేసుకుంది.
ఈ మూడు ఉదంతాల్లోనూ పోలీసులు కేసులు నమోదు చేశారు.కానీ.. ఈ తరహా దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందంటున్నారు.