అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబు చేపట్టిన రోడ్ షో సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన రోడ్ షోకు మంత్రి ఆదిమూలపు సురేశ్ నిరసన చేపట్టటం.. బాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించటమే కాదు.. ఆయన కాన్వాయ్ మంత్రి క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చేసరికి.. చంద్రబాబు కాన్వాయ్ మీద రాళ్లదాడి జరిగింది. మంత్రి నిరసనకు మద్దతుగా నిలిచిన వైసీపీ కార్యకర్తలతే రాళ్లదాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.
ఈ క్రమంలో ఎన్ ఎస్ జీ కమాండోలు చుట్టూ రక్షణ కవచంలా నిలిచారు. ఈ క్రమంలో రాయి తగిలిన కారణంగా కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయమైంది. ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి.. మూడు కుట్లు వేశారు. చంద్రబాబుకు కమాండోలు కానీ రక్షణ కవచంలా నిలవకుంటే చంద్రబాబు మీద రాళ్లు పడేవని చెబుతున్నారు. వైసీపీ కార్యకర్తలు చేపట్టిన రాళ్ల దాడిలో టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తల(ఊట్ల కోటయ్య, మన్నువ హరిబాబు)కు గాయాలు అయ్యాయి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
మూడు రోజులుగా విపక్ష నేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం గిద్దలూరు.. గురువారం మార్కాపురంలో రోడ్ షోలకు హాజరైన చంద్రబాబు, శుక్రవారం మంత్రి సురేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యక్రగొండపాలెంలో పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో దళిత ద్రోహి చంద్రబాబును అడ్డుకునేందుకు చంద్రబాబు గో బ్యాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.
మంత్రి సురేశ్ క్యాంప్ కార్యాలయం వద్దకు చంద్రబాబు రోడ్ షో చేరుకునే సరికి.. విపక్ష నేతపై రాళ్లదాడి మొదలైంది. ఈ సందర్భంగా రక్షణగా నిలిచిన కమాండెంట్ తలకు రాయి తగిలి గాయమైంది. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు.. తన వాహనం నుంచి బయటకు వచ్చారు. ‘ఏం మీ ఊరు రాకూడదా? అడ్డుకుంటావా?’ అంటూ చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమపైకి జరుగుతున్న రాళ్లదాడి.. విసురుతున్న చెప్పులతో టీడీపీ కార్యకర్తలు సైతం తిరగబడటం మొదలు పెట్టారు.
దాడులు చేస్తున్న అధికార పార్టీ వారిని వదిలేసి.. పోలీసులు తమను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల తీరుపైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తమపై దాడికి పాల్పడుతున్న వారిపైకి తిరబడ్డారు. దీంతో.. పరిస్థితి చేజారుతున్నట్లుగా కనిపించింది. అయితే.. పోలీసులు మంత్రి ఆదిమూలపు సురేశ్ ను.. వైసీపీ కార్యకర్తల్ని క్యాంప్ కార్యాలయంలోకి పంపించేయటం ద్వారా ఉద్రిక్త వాతావరణాన్ని తేలిక పరిచే ప్రయత్నం చేశారు. ఇదేదో.. చంద్రబాబు కాన్వాయ్ చేరుకోవటానికి ముందే చేసి ఉంటే.. రాళ్ల దాడి.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేవే కాదన్న మాట వినిపించింది. విపక్ష నేత మీద రాళ్ల దాడి జరుగుతుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారంటూ మండిపడ్డారు. నిరసన తెలిపేందుకు సిద్ధమైన మంత్రిని.. పార్టీ కార్యకర్తల్ని ముందుగానే పంపించేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.