ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఈ నెల 24న సీఎం జగన్ పులివెందులకు వెళ్లటం తెలిసిందే. ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఆయన సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాన్నిపూర్తి చేసుకొని తిరిగి వచ్చే వేళలో.. సీఎం జగన్ కాన్వాయ్ పై రాయితో దాడి చేసిన వైనం వెలుగు చూసింది.
నిజానికి ఈ ఉదంతాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. రాయి విసిరిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడ్ని తీవ్రంగా కొట్టటంతో ఈ విషయం బయటకు పొక్కినట్లుగా చెబుతున్నారు. నియోజకవర్గంలోని గురజాల గ్రామానికి చెందిన అప్పయ్య అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనంపై రాయి విసిరినట్లుగా గుర్తించారు.
అయితే.. ఈ రాయి సీఎం ప్రయాణిస్తున్న కారు మీద కాకుండా.. ఇంటెలిజెన్స్ డీఎస్పీ కారుపై పడింది. దీంతో.. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనికి తగిన మర్యాదను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల పాటు నిర్బంధంలో ఉంచిన పోలీసులు.. అతడ్ని బాగా కొట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. చివరకు వైసీపీ నేతలే వెళ్లి.. అతడ్ని విడిపించినట్లుగా చెబుతున్నారు.
దివ్యాంగుడైన అప్పయ్య ఫించను కోసం గతంలో అప్లై చేసుకున్నా.. అతడికి పింఛన్ రాలేదు.దీంతో ఆగ్రహానికి గురైన అతను.. సీఎం కాన్వాయ్ లోని వాహనంపై రాయి విసిరిన వైనం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో ఈ ఉదంతం చోటుచేసుకోవటం సంచలనంగా మారింది.