ఎమ్మెల్యేల కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదల కావటం తెలిసిందే. దీనిపై ఏపీ అధికారపక్ష అధినేత ఆరుగురు నేతల్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఈ ఎన్నికకు సంబంధించి విపక్షాలకు బలం లేకపోవటంతో.. అధికారపక్షం ఖరారు చేసిన ఆరుగురు అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆరుగురిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. మహమ్మద్ ఇక్బాల్.. కరీమున్నీసా, బల్లి కల్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్య శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పోటీకి ఎవరూ నిలవకపోవటంతో వీరి ఎన్నిక ఏకగ్రీవంగా మారింది.
దీంతో.. మండలిలో ఏపీ అధికారపక్షం బలం 18కు పెరిగినట్లైంది. ప్రస్తుతం మండలిలో టీడీపీ సభ్యుల బలం 26కాగా.. ప్రొగ్రెసివ్ డెమొక్రట్ ఫ్రంట్ బలం ఐదుగురు. బీజేపీ.. స్వతంత్రలు.. ఖాళీలు మూడేసి చొప్పున ఉన్నాయి. మరికొద్దినెలల వరకు మండలిలో విపక్ష టీడీపీ బలమే ఎక్కువగా ఉండనుంది.