కెరీర్ ఆరంభ దశలో వచ్చే ప్రతి అవకాశం విలువైందే. అలాంటి దశలో కాల క్రమంలో కల్ట్ మూవీ స్టేటస్ అందుకున్న సినిమాలో అవకాశం అందినట్లే అంది చేజారితే.. కలిగే బాధ వర్ణనాతీతం. తాను అలాంటి బాధనే అనుభవించానని అంటున్నాడు సౌత్ సూపర్ స్టార్లలో ఒకడైన విక్రమ్. మణిరత్నం కల్ట్ మూవీ ‘బొంబాయి’లో విక్రమే హీరోగా నటించాల్సిందట. కానీ ఆడిషన్స్ టైంలో తాను చేసిన ఓ తప్పు వల్ల ఆ ఛాన్స్ మిస్సయిందని.. ఆ బాధ తనను చాన్నాళ్ల పాటు వెంటాడిందని విక్రమ్ తాజగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన కొత్త చిత్రం ‘తంగలాన్’ మంచి హిట్టయిన ఆనందంలో ఉన్న విక్రమ్.. ‘బొంబాయి’ ఛాన్స్ మిస్సయిన తీరు గురించి వివరించాడు.
‘‘మణిరత్నం అంటే నాకెంతో ఇష్టం. ఆయన మేకింగ్ స్టైల్‌ను చాలా ఇష్టపడతా. నా కెరీర్ ఆరంభంలో ఆయనతో సినిమా చేయాలని కలలు కన్నాను. మణి సర్‌తో ఒక్క సినిమా అయినా చేసి అంతటితో కెరీర్ ముగిసినా ఆనందమే అనుకున్నా. అలాంటి టైంలో బొంబాయి సినిమా కోసం నన్ను ఆడిషన్స్‌కు పిలిచారు. కానీ అక్కడ నేను చేసి తప్పు ఆ అవకావం చేజారేలా చేసింది. సడెన్‌గా ఒక రోజు పిలిచి.. స్టిల్ కెమెరా పెట్టి ఒక సన్నివేశం నటించి చూపించమన్నారు.
వీడియో కెమెరాతో షూట్ చేయాలి కానీ.. స్టిల్ కెమెరా ఏంటి అనుకున్నా? ఇలాంటి పరిస్థితుల్లో నటించడమేంటి అనిపించింది. పైగా నేను కదిలితే స్టిల్ కెమెరాలో బ్లర్ వస్తుందని కదలుకుండా ఉండిపోయా. మొత్తంగా సరిగా పెర్ఫామ్ చేయకుండా కదలకుండా ఉండిపోయా. అలా ఆ అవకాశం చేజారింది. తర్వాత దీని గురించి చాలా బాధ పడ్డా. బొంబాయి సినిమా రిలీజై పాన్ ఇండియా స్థాయిలో కల్ట్ మూవీ అయింది. రెండు నెలల పాటు ఉదయం లేవడం, ఈ ఛాన్స్ మిస్సయిందని ఏడవడం.. ఇదీ వరస’’ అని విక్రమ్ వెల్లడించాడు. ఐతే అప్పుడు ఆ ఛాన్స్ మిస్సయినా.. తర్వాత మణిరత్నంతో రావణ్, పొన్నియన్ సెల్వన్-1, 2 చిత్రాల్లో నటించాడు విక్రమ్.