సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట మసకబారిందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా శ్రీవారి భక్తులకు కనీస సౌకర్యాలు అందించడంలో టీటీడీ ఘోరంగా విఫలం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అలిపిరిలో భక్తులను నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలు కావడం దుమారం రేపుతోంది. తిరుమల వెంకన్న దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులను అదుపుచేయడంలో సిబ్బంది విఫలమయ్యారు. దీంతో, తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. దీంతో, భక్తులంతా ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ హాహాకారాలు చేశారు.
తిరుమలలో భక్తులకు కనీస సౌకర్యాలు, వసతులు, భద్రత కల్పించడంలో జగన్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. సరైన నియంత్రణ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో ఒక్కసారిగా తీవ్ర రద్దీ ఏర్పడింది. పది, ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతుండడం నేపథ్యంలో శ్రీనివాసుని దర్సనం కోసం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుండడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
దీంతో, టోకెన్ల కోసం జరిగిన తోపులాటలో కొంతమంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిలో ఎక్కువమంది మహిళలు పిల్లలే ఉన్నారు. తోపులాటలో ముగ్గురికి గాయాలు కాగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. ఓ పక్క ఎండలు మండిపోతుడడంతో ముసలి వారు, చంటి బిడ్డలతో వచ్చిన భక్తులు విలవిలలాడిపోతున్నారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ సిబ్బంది, అధికారులు విఫలమయ్యారని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు, నాలుగు రోజులవుతున్నా కనీసం టోకెన్లు ఇవ్వట్లేదని, భోజనం, మంచినీళ్లు వంటి కనీస సదుపాయాలు లేక కల్పించట్లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. గత 20 సంవత్సరాలలో టీటీడీలో ఈ స్థాయిలో పాలనాపరమైన వైఫల్యం చెందడం ఇదే తొలిసారని భక్తులు మండిపడుతున్నారు. తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన రద్దీని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని భక్తులందరూ నిరసన తెలిపారు.