కొన్నేళ్ల ముందు శ్రీరెడ్డి అనే అమ్మాయి సినిమా రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్‌గా మారడం తెలిసిన సంగతే. దగ్గుబాటి అభిరామ్ సహా పలువురు ఫిలిం సెలబ్రెటీల మీద ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. మొదట్లో ఆమె ఆరోపణల పట్ల జనం ఆసక్తి ప్రదర్శించారు కానీ.. చివరికి క్లీన్ ఇమేజ్ ఉన్న నాని, శేఖర్ కమ్ముల లాంటి వాళ్లను కూడా ఇందులోకి లాగడంతో ఆమె క్రెడిబిలిటీ కోల్పోయింది. కట్ చేస్తే ఆమె దృష్టి రాజకీయాల మీదికి మళ్లి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి దారుణమైన బూతు మాట మాట్లాడి వార్తల్లో వ్యక్తిగా మారింది శ్రీరెడ్డి.
ఆమెతో ఈ మాట అనిపించింది తనే అని రామ్ గోపాల్ వర్మ అన్నా సరే.. దీని వెనుక అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం ఉన్నట్లుగా పవన్ అభిమానులు, జనసేన మద్దతుదారులు అనుమానించారు. టీడీపీని టార్గెట్ చేశారు. తర్వాతి రోజుల్లో శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చేయడం, పూర్తిగా ఫేడవుట్ అయిపోవడం తెలిసిందే. ఐతే చాన్నాళ్ల తర్వాత శ్రీరెడ్డి ఇప్పుడు ఒక వీడియోతో సామాజిక మాధ్యమాల్లో మళ్లీ ఆసక్తికర చర్చకు కారణమైంది. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న విషయాన్ని ఆమె వెల్లడించింది. కానీ ఎన్నో కష్టాలకు ఓర్చి.. ఎంతోమంది నుంచి వ్యతిరేకత ఎదుర్కొని.. సోషల్ మీడియా అకౌంట్లను కూడా పోగొట్టుకుని వైసీపీ కోసం పని చేస్తే చివరికి తగిన గుర్తింపు కానీ, ఆదాయం కానీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
వైసీపీ నేతలు, కార్యకర్తలు తనను ఎప్పుడూ ఓన్ చేసుకోలేదని.. అవసరమైనపుడు అండగా నిలవలేదని ఆమె గోడు వెల్లబోసుకుంది. తన లాగే వైసీపీ కోసం పని చేసిన చాలామంది సోషల్ మీడియా వారియర్స్ ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారని.. వారిని వైసీపీ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన చెందింది. ఇప్పటికైనా జగన్ దీని మీద దృష్టిపెట్టి కష్టాల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఐతే ఈ వీడియోతో శ్రీరెడ్డి ఏ పార్టీ మనిషి అనే విషయం ఒక క్లారిటీ వచ్చేయడంతో అప్పట్లో పవన్‌ను ఎవరు తిట్టించారనే విషయం జనాలకు బాగా అర్థమవుతోంది.