ప్రజాగ్రహం ఎలాగుంటుందో శ్రీలంకలో స్పష్టంగా కనబడుతోంది. సునామీలో చుట్టుముట్టిన జనాగ్రహానికి ముందు ప్రధానమంత్రి రాజీనామా చేసేశారు. తర్వాత వేరే దారిలేక, తప్పని స్థితిలో కొందరు మంత్రులు రాజీనామాలు చేసి పదవుల్లో నుండి దిగిపోయారు. అయినా జనాగ్రహం తగ్గలేదు. తగ్గలేదు సరికదా శనివారం సునామీలా మరోసారి చుట్టుముట్టడంతో చివరకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏకంగా దేశం నుండే పరారైపోయారు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి రణిల్ విక్రమ్ సింఘే కూడా రాజీనామా బాటలో నడుస్తున్నారు. 13వ తేదీన ప్రధానిగా రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించేశారు. అధ్యక్షుడైతే తన భవనంలో నుండి ముందు ఒక అంబులెన్సులో బయటపడి తర్వాత నౌకలో శ్రీలంక నుండి పరారైనట్లు సమాచారం. రాజీనామా చేస్తానని ప్రధాని ప్రకటించినా జనాలు వినకుండా విక్రమసింఘే భవనాన్ని తగలబెట్టేశారు.
ప్రజాగ్రహం ఏస్ధాయిలో ఉంటుందో తాజాగా శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. జనాలు తెగబడటం, అధ్యక్షుడు దేశాన్ని వదలి పారిపోవటం అన్నది ఇప్పటివరకు ఈజిప్టు, లిబియా లాంటి కొన్ని నియంత పాలిత దేశాల్లోనే ప్రపంచం చూసింది.
ప్రజాస్వామ్య దేశమైన శ్రీలంకలో కూడా ఈ పరిస్ధితి తలెత్తిందంటే జనాలు ఏ స్ధాయిలో అధ్యక్ష, ప్రధానులపై మండిపోతున్నారో అర్ధమవుతోంది. గడచిన నాలుగు నెలలుగా శ్రీలంకలో సంక్షోభం ఏ స్ధాయిలో ఉందో యావత్ ప్రపంచం చూస్తునే ఉంది.
తినటానికి సరిపడా తిండిలేదు. చేసుకోవటానికి వ్యాపారాలు లేవు. తిరగటానికి పెట్రోల్, డీజిల్ లేదు. అనారోగ్య బాధితులకు మందులు లేవు. ఆపరేషన్లు చేసేందుకు కరెంటులేదు. దేశంలోని లక్షలాది మధ్య, దిగువ తరగతి కుటుంబాలు రెండుపూటలా భోజనం చేసి నెలలవుతోంది. పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడటం వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.
దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒకలాంటి అంతర్యుద్ధం మొదలైపోయింది. ఇవన్నీ కలిసిపోయి ప్రజల్లో ఆగ్రహం తిరుగుబాటు రూపంలో అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకునేస్ధాయికి చేరుకుంది. మరి తాజా పరిణామాల ఫలితం ఏ రూపంలో ఉంటుందో చూడాలి.