టీడీపీ యువ నాయకుడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఒకవైపు.. వైసీపీ ప్రవేశ పెట్టిన వలంటీర్ల వ్యవస్థ విషయంలో టీడీపీ ఆచి తూచి వ్యాఖ్యానిస్తోంది. ఈ వ్యవస్థ ప్రజల్లోకి వెళ్లిపోవడం.. ప్రజలంతా కూడా ప్రభుత్వం అంటే.. తమ కళ్ల ముందు కనిపించే వలంటీర్లనే విశ్వాసం పెంచుకున్న నేపథ్యంలో చంద్రబాబు నుంచి కీలక నేతల వరకు కూడా వలంటీర్ల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థను తీసేయబోమని.. మరింత ఉన్నతీకరి స్తామని వారు చెబుతున్నారు. కేవలం తప్పులు చేసిన వలంటీర్లను, ప్రభుత్వ పక్షానికి అనుకూలంగా వ్యవహరించిన వారిని మాత్రమే తొలగిస్తామని చెబుతున్నారు.
నారా లోకేష్ అయితే.. వలంటీర్లకు మెరుగైన జీతం కూడా ఇస్తామన్నారు. ఇలా కీలక ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు వలంటీర్ల వ్యవస్థపై ఆచి తూచి వ్యవహరిస్తుంటే.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి తాజాగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “వలంటీర్లు ఉగ్రవాదులు“ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వారిని ఏరేస్తామంటూ.. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఇది పెను రచ్చగా మారిపోయింది. ఇప్పటి వరకు వైసీపీ.. వలంటీర్లకు టీడీపీ వ్యతిరేకమని చెబుతూ వచ్చిన వ్యాఖ్యలకు ఇది మరింత ఆజ్యం పోసింది.
దీంతో వైసీపీ నేతలకు ఈ వ్యాఖ్యలు అందివచ్చిన వరంగా మారాయి. వాలంటీర్లను బొజ్జల సుధీర్ రెడ్డి ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి హితవు పలికారు. కరోనా టైంలో వాలంటీర్లు ఎంతో సేవ చేశారని.. ఆ సమయంలో టీడీపీ జన్మభూమి కమిటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బొజ్జల వ్యాఖ్యలపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని సూచించారు. వాలంటీర్లపై అనవసరంగా మాట్లాడితే సహించేది లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడంపై నిప్పులు చెరిగారు.
కట్ చేస్తే.. బొజ్జల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆత్మ రక్షణలో పడింది. గ్రామ వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జీ బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరణ ఇఛ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. బొజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లను కొనసాగించడం సహా.. వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఇదలావుంటే.. పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన బొజ్జలను పోటీ నుంచి పక్కన పెట్టేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.