క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీలో ఇఫ్పుడిప్పుడే అసమ్మతి బయటపడుతోంది. అంటే ఇంత కాలం నివురుగప్పిన నిప్పులాగున్న అసంతృప్త నేతలంతా ఒకచోట చేరుతుండటంతో వేడి బయటపడుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఇపుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తానికి మాజీమంత్రి, సీనియర్ ఎంఎల్ఏ ధర్మాన ప్రసాదరావు కేంద్ర బిందువుగా మారటమే అసలు విషయం.
ఇంతకీ విషయం ఏమిటంటే మంత్రివర్గంలో చోటు దొరకని కారణంగా ధర్మానలో అసంతృప్తి మొదలైంది. అయితే తన సోదరుడు ధర్మాన కృష్ణదాసుకు మంత్రిపదవి ఇచ్చి తర్వాత ఉపముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. సోదరుడిని అందలం ఎక్కించారన్న తృప్తితో ప్రసాదరావు కొంత కాలం మౌనంగానే ఉన్నా అసంతృప్తయితే పెరుగుతునే ఉంది. అందుకనే అవకాశం వచ్చినపుడల్లా ఏదో రూపంలో తనలోని అసంతృప్తిని సీనియర్ ఎంఎల్ఏ బయటపెడుతునే ఉంటారు. కొంతకాలం సర్దుకుంటారు మరికొంత కాలం బహిరంగంగానే తన అసమ్మతిని బయటపెడుతుండటం మామూలైపోయింది.
ఈ నేపధ్యంలోనే జిల్లా ఎంఎల్ఏ డాక్టర్ సీదిరి అప్పలరాజును మంత్రివర్గంలోకి తసుకోవటంతో ప్రసాద్ లో మళ్ళీ అసంతృప్తి మొదలైపోయింది. తనకన్నా జూనియర్ మోస్టుకు కూడా జగన్ మంత్రివర్గంలోకి చేర్చుకుని తనను దూరంగా పెట్టేస్తున్నారనే మంట పొయ్యిమీద నీళ్ళు కాగినట్లు ప్రసాదరావులో పెరిగిపోతోంది. అయితే తనలోని అసంతృప్తిని నేరుగా జగన్ పై బహిరంగంగా చెప్పలేకున్నారు. ఎందుకంటే సోదరుడికి బాగానే ప్రాధాన్యత దక్కుతోంది కాబట్టి.
ఈ పరిస్ధితుల్లోనే మళ్ళీ ఏమైందో ఏమో నాలుగు రోజుల క్రితం తనలాగే పార్టీ నాయకత్వంపై మండిపోతున్న నేతల్లో కొందరిని ప్రసాదరావు కూడేసినట్లు సమాచారం. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండల హెడ్ క్వార్టర్స్ లో ఓ ఇంట్లో ప్రసాదరావు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ ఇల్లు ఎవరిదయ్యా అంటే ఒకపుడు ప్రసాద్ అంటేనే మండిపోయే మాజీ ఎంఎల్ఏ నరేష్ కుమార్ అగర్వాల్ ది. ఒకపడు ఉప్పు నిప్పులాగుండే ప్రసాద్-అగర్వాల్ ఇపుడు ఏకమైపోయారు. దాంతో ప్రసాద్ నిర్వహించిన ఈ సమావేశానికి అగర్వాల్ ఇల్లే వేదికవ్వటం ఆశ్చర్యం. పైగా ఈ మీటింగ్ విషయం నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ, ఇన్చార్జి పిరియా దాట్ రాజుకి కూడా తెలీదు.
ఈ సమావేశానికి ఇచ్చాపురం ఎంఎల్ఏగా గతంలో పోటీ చేసిన నట్టు రామారావు, కళింత కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణితో పాటు పలాస, టెక్కలి, ఇచ్చాపురంకు చెందిన మరికొందరు నేతలు కూడా హాజరయ్యారట. అందరిలోను ఏదో ఓ విషయమై జగన్ పై అసంతృప్తి ఉందని తెలుస్తోంది. జగన్ కు సన్నిహితునిగా పేరున్న పేరాడ తిలక్ కు ఎందుకు అసంతృప్తంటే తనను టెక్కలి ఇన్చార్జిగా తీసేసినందుకట. మొత్తానికి ఏదో రూపంలో తనలోని అసంతృప్తిని బయటపెడుతున్న ప్రసాదరావును ముఖ్యమంత్రి గుర్తిస్తారా ? అన్నదే డౌటనుమానం. ఎందుకంటే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు జగన్ బెదరడని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది. మరి ఇదే దారిలో ప్రసాదరావు వెళతానంటే నష్టం ఎవరికి ?