ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రష్యాకు చెందిన స్పుత్నిక్ – వీ వ్యాక్సిన్ ను మరో వారంలో భారత విపణిలోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కొవిడ్ కు చెక్ చెప్పేందుకు రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉండటం.. డిమాండ్ పెద్ద ఎత్తున ఉండటం.. అందుకు తగ్గ ఉత్పత్తి లేకపోవటంతో దేశ వ్యాప్తంగా తీవ్రమైన టీకా కొరత నెలకొంది.
ఈ నేపథ్యంలో రష్యా రూపొందించిన స్పుత్నిక్ – వీ వ్యాక్సిన్ ను దేశీయంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ టీకాను భారత్ కు చెందిన రెడ్డీ ల్యాబ్ అందిస్తోంది.
రష్యా నుంచి దిగుమతి చేసుకున్న టీకాల్ని మొదట అమ్ముతారు.
త్వరలో రెడ్డీ ల్యాబ్స్ తాను సొంతంగా ఉత్పత్తి చేయనుంది.
దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ కు ఒక ధర.. తాను స్వయంగా ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ కు మరో ధర ఉంటుందన్న విషయాన్ని డాక్టర్ రెడ్డీ ల్యాబ్ పేర్కొంది.
దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ ధర రూ.995.40 ఉండనున్నట్లు చెబుతున్నారు. ఐదు శాతం జీఎస్టీ బాదుడు కూడా ఉంటుందని పేర్కొన్నారు.
భారత్ లో తాము తయారు చేసే స్పుత్నిక్ టీకా ధర కాస్త తక్కువగా ఉంటుందని వెల్లడించింది.
స్పుత్నిక్ వ్యాక్సిన్ ను వచ్చే వారం నుంచి అందుబాటులోకి తేనున్నట్లుగా కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు భారత్ లో ఫూణెకు చెందిన సీరం సంస్థ తయారు చేస్తున్న కోవిషీల్డ్.. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ లభ్యమవుతున్నాయి.
దేశీయంగా మూడో వ్యాక్సిన్ గా స్పుత్నిక్ రానుంది. అంతా బాగుంది కానీ.. ప్రాణాధారమైన వ్యాక్సిన్ మీదా జీఎస్టీ వాయింపు ఉండాల్సిందేనంటారా మోడీ?మిగిలిన వాటి సంగతి తర్వాత.. వ్యాక్సిన్ మీద కూడా ఈ బాదుడేందబ్బా?