సీఎం జగన్ పుణ్యమా అంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. గవర్నర్ కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు కలిసి వినతి పత్రం సమర్పించడం చర్చనీయాంశమైంది. అయితే, ఆ భేటీలో ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించకుండా ఏపీ ఎన్జీవో సంఘం నేతలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతు విమర్శలు చేశారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాత్రమే ఛాంపియన్లుగా, తాము చవటలం అన్నట్టుగా చిత్రీకరించడం మానుకోవాలని హితవు పలికారు. సూర్యనారాయణ తన స్వార్థం కోసం ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఇక, వారంతా గవర్నర్ ను కలవడం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో వారి వ్యాఖ్యలపై సూర్యనారాయణ రావు స్పందించారు.
ఉద్యోగుల సర్వీసు నియంత్రణ అధికారం కేవలం గవర్నర్ కు మాత్రమే ఉందని, అందుకే ఆయనను కలిశామని అన్నారు. ఇతర సంఘాల పేర్లు గానీ, నేతల గురించి గానీ తాము ప్రస్తావించలేదని క్లారిటీనిచ్చారు. సమ్మె చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి దొడ్డి దారిన గుర్తింపు వచ్చినట్టుగా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని జీవోలు ఉన్నాయని, కానీ, చట్టం లేదని గుర్తు చేశారు.
అలా చట్టం చేయాలని తాము కోరామని అన్నారు. బండి శ్రీనివాసరావుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు కూడా మండిపడ్డారు. ఏపీ ఎన్జీవో సంఘం అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తోందని, రాజకీయానికి తొలిమెట్టు అన్నట్టుగా వారి వైఖరి ఉందని విమర్శించారు. తోటి సంఘం నేతలను ఖబర్దార్, కాస్కో, చూస్కో అంటూ బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం నుంచి సగం మంది ఉద్యోగులు తమ సంఘాల్లో చేరారని, తమది నిర్మాణాత్మక వైఖరి అని స్పష్టం చేశారు.