ఈ దేశంలో ఎంతో మంది దానకర్ణులు ఉండొచ్చు. తమ సంపదను పంచతున్న వారు చాలామంది ఉండొచ్చు. కానీ సరైన సమయంలో, సరైన వ్యక్తికి తన చేయూత ఇవ్వడంలో వంద మార్కులు సంపాదించిన వ్యక్తి సోనుసూద్.
అన్నం తింటున్నవాడికి బిర్యానీ పెట్టి సంతోషపెట్టడం మంచితనం. ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం మానవత్వం, నిజమైన సాయం. సోనుసూద్ ఈ పాయింట్ మీదే నిలబడ్డారు. అతను ఖర్చు పెట్టిన ప్రతిరూపాయి ఎవరికి అందాలే వారికే అందింది. ఎపుడు అందాలో అపుడే అందింది.
లాక్ డౌన్ సమయంలో తాను చేసిన సాయంతో ఎన్నో జీవితాలు మారిపోయాయి. ఎన్నో కుటుంబాలు క్షోభను తప్పించుకున్నాయి. ఎన్నో గాయపడిన హృదయాలకు సాంత్వన దొరికింది. జన్మజన్మలకు సరిపోయే పుణ్యం సంపాదించుకున్నారు సోనుసూద్.
అయినా, అతను ఆగలేదు… ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ చదవాలన్న తాపత్రయం, ఆసక్తి, ఆశ ఉన్న మెరుగైన పేద విద్యార్థులకు అండగా నిలబడ్డానికి సోను ముందుకు వచ్చారు. www.schollifeme.com అనే వెబ్ సెట్ దీనికోసమే ప్రారంభించారు. పేద విద్యార్థుల ఐఏఎస్ కలను సాకారం చేయడమే దీని లక్ష్యం. ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు సాయం పొందుతున్న వారే కాదు, దేశమే అతనికి రుణపడి ఉండాలి. ఎందుకంటే అర్హులను ఈ లోకానికి అందజేస్తున్నాడు అతను. తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుపై ఈ పనిచేస్తున్నారు.
ఇవే కాదు, చిన్న పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలపై కూడా సోనూ దృష్టిసారించారు. సమస్య ఏదైనా తనదైన శైలిలో స్పందించడం సోనూకు అలవాటుగా మారింది. ఇంత గొప్ప బిడ్డను కన్న సరోజ్ సూద్ నిజంగా అదృష్టవంతురాలు.