దేశమంతా కార్యకర్తల బలం ఉండి.. సరైన నేతలున్నప్పటికీయ జాతీయ స్థాయిలో పార్టీని సమర్థంగా నడిపించే నాయకత్వం లేకపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధాని మోడీ ప్రభ క్రమంగా పెరగడం.. మరోవైపు కాంగ్రెస్‌ను నడిపించే విషయంలో అధిష్ఠానంలో ఓ అవగాహన స్పష్టత లేకపోవడంతో దేశంలో 2014 ఎన్నికలప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది.
ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోవడం మొదలైంది. ఓ దశలో దశాబ్దాల పాటు దేశంలో ఏకచ్ఛధ్రాతిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్ ఆ తర్వాత క్రమంగా పట్టు కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో మూడు రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు) అధికార కూటమిలో భాగంగా ఉంది.
ప్రస్తుతం కరోనా కట్టడిలో విఫలమవడం, ఇంధన ధరలను నియంత్రించలేకపోతుండడం తాజాగా పెగాసస్ వ్యవహారం.. ఇలా దేశంలో మోడీ ప్రభ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ సమయంలో దేశంలో మోడీకి ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి అవసరం ఏర్పడింది. మరోవైపు దేశంలో కాంగ్రెస్‌ను తిరిగి పుంజుకునేలా చేయాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్ఠానంపై ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగింది.
ఓ వైపు ప్రతిపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తేవడంతో పాటు సొంతపార్టీని బలపర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో సోనియా సమావేశం నిర్వహించింది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు నిరసనలు చేపట్టాలని ఈ సమావేశంలో పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
సోనియా అధ్యక్షతన వర్చువల్‌గా సాగిన ఈ సమావేశంలో ప్రతి పక్ష పార్టీలన్నీ మోడీపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నామనే సంకేతాలు పంపించాయి.
మరోవైపు పార్టీలో భారీ మార్పులు చేపట్టే దిశగా కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రలకు జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని సమాయత్తం చేసే ప్రయత్నాలు మొదలెట్టింది. 2022లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, గుజరాత్‌ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఆ రాష్ట్రాల్లో కొన్నింట్లో ఒంటరిగా.. మరికొన్ని చోట్ల ప్రతిపక్షాలతో కలిసి పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి ఓడించడమే లక్ష్యంగా తన పార్టీని సరిదిద్దే ప్రయత్నాలకు సోనియా శ్రీకారం చుట్టేలా కనిపిస్తోంది. ఈ దిశగానే త్వరలోనే కనీసం ముగ్గురు కొత్త ప్రధాన కార్యదర్శులను నియమించే అవకాశాలున్నాయి.
రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి యువ నాయకులకు కీలక పదవులు ఇవ్వడం, సీనియర్ నేతలైన గులాం నబీ అజాద్, రమేశ్ చెన్నితల వంటి వారి అనుభవాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం ఆమె ప్రణాళికల్లో భాగమేనని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.