రూ.70కే క్వాలిటీ లిక్కర్ చీప్ గా అందిస్తామంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. సోము కామెంట్లపై ఇటు నెటిజన్లు మొదలుకొని అటు విపక్ష పార్టీల నేతల వరకు ట్రోల్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తవుల ధరల గురించి పట్టించుకోని సోము…లిక్కర్ గురించి చీప్ కామెంట్లు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కామెంట్ల వల్ల ఏర్పడిన కాంట్రవర్సీని క్లియర్ చేసేందుకు సోము తాజాగా మరో ఆణిముత్యాన్ని వదిలారు.
ఏపీలో బీజేపీ అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేస్తామని, అన్ని తక్కువ ధరకే ఇస్తామని అన్నారు. సన్నబియ్యం కిలో 40 రూపాయలకే అందిస్తామని, టమోటా, ఉల్లి వంటి కూరగాయల ధరలు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఇక, రైతులకు సహకారం, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని అన్నారు. అంతేకాదండోయ్, సబ్బు, పేస్ట్ తో సహా ఇతర వస్తువుల ధరలను కూడా తగ్గిస్తామంటూ హామీ ఇచ్చారు.
ఇవేవో ఆషామాషీగా చేస్తున్న కామెంట్లు కాదని, ఆ హామీలను అమలు చేసేందుకు పక్కా ప్రణాళికను ప్రకటిస్తామని కూడా చెప్పారు సోము. ఇక, తన కామెంట్లను డిఫెండ్ చేసుకోవడానికి సోము చేసిన తాజా కామెంట్లపై కూడా ట్రోలింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సోనామసూరి బియ్యం ఇప్పుడు కిలో రూ. నలభై కంటే తక్కువ రేటుకే లభిస్తున్నాయి. అయితే, వాటికి రకరకాల బ్రాండ్లు వేసి రేటు కొంచెం పెంచి అమ్ముతున్నారు.
ఆ సంగతి పక్కనబెడితే, పేస్టులు, సబ్బుల రేట్లు తగ్గిస్తామంటూ సోము చేసిన కామెంట్లు ఫన్నీగా ఉన్నాయంటూ ట్రోలింగ్ మొదలైంది. అవి తయారు చేసే కంపెనీలను కూడా సోము శాసిస్తారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇటువంటి నేతలను పెట్టుకొని ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటోందని ఎద్దేవా చేస్తున్నారు.