ఎప్పుడు ఏ పని చేస్తే ప్రజల మనసుల్ని గెలుచుకోవాలో మోడీ సర్కారుకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. వేరుగా ఉండే రైల్వే బడ్జెట్ ను జనరల్ బడ్జెట్ లో కలిపేయటమే కాదు.. ప్రతి ఏటా కొత్త రైళ్లను ప్రకటించే సంప్రదాయానికి చెక్ పెట్టేశారు. పెండింగ్ రైళ్ల పేరు చెప్పి.. వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. వందే భారత్ పేరుతో సరికొత్త ఎడిషన్ తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. మామూలు రైళ్ల టికెట్లతో పోలిస్తే.. రెండింతలు ఎక్కువగా ఉన్నప్పటికి వేగంతో తీసుకెళతారన్న పేరుతో.. సూపర్ ఫాస్ట్ రైళ్ల వేగంతోనే ప్రయాణించే రైళ్లకు డబుల్ ఛార్జీ చెల్లించేలా చేసే తెలివి మోడీ మాష్టారికే ఉందని చెప్పాలి.
కాకుంటే.. మిగిలిన ట్రైన్లు.. సూపర్ ఫాస్ట్ రైళ్లతో పోలిస్తే.. వందే భారత్ రైళ్ల స్టాప్పులు తక్కువన్న సంగతి తెలిసిందే. తొలుత సీటింగ్ వందే భారత్ లను తీసుకొచ్చిన సర్కారు వచ్చే ఏడాది మార్చి నాటికి స్లీపర్ క్లాస్ వందే భారత్ లను దేశ వ్యాప్తంగా పరుగులు తీయించాలని భావిస్తోంది. ఏప్రిల్ – మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగే వేళకు.. స్లీపర్ వందే భారత్ లను పట్టాల మీదకు ఎక్కించటం ద్వారా తమ ప్రభుత్వం సాధించిన ఘనతను భారీగా ప్రచారం చేసుకోవాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం 2024 మార్చిలో పట్టాలెక్కాల్సిన స్లీపర్ వందే భారత్ లను మరికాస్త ముందుగా పట్టాల మీద పరుగులు తీయించే కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు. చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా వీటిని తీర్చిదిద్దారు. వీటి ఇంటీరియర్ కూడా బాగుందన్న ఫీడ్ బ్యాక్ ఇప్పటికే విడుదల చేసిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్లీపర్ బోగీల్లో మిగిలిన రైళ్లలో మాదిరి అప్పర్ బెర్తు మీదకు ఎక్కేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైకి ఎక్కే వీలుంది.
ఒక స్లీపర్ వందే భారత్ లో 857 బెర్తులు ఉంటాయి. వీరికి సేవలు అందించేందుకు 37 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఒక ప్యాంట్రీకారు ఉంటుంది. ఇప్పటికే ఉన్న బెర్తులతో పోలిస్తే మరింత విశాలంగా ఉండేలా డిజైన్ చేశారు. ప్రతి బోగీలో మూడు మరుగు దొడ్లు ఉండేలా ప్లాన్ చేశారు. మరి.. ఈ స్లీపర్ వందే భారత్ లను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ని కేటాయిస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక అంచనా ప్రకారం కనీసం నాలుగైదు వరకు ఉంటాయని చెబుతున్నారు. రెండు అయితే తగ్గవంటున్నారు. సికింద్రాబాద్ – చెన్నై రూటుతో పాటు విశాఖపట్నం – చెన్నై రూటులోనూ మరో రైలు ఉంటుందని చెబుతున్నారు. ఇది కాకుండా తిరుపతికి కూడా ఒక స్లీపర్ వందే భారత్ ఉంటుందని చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.