ఇటీవల కాలంలో ఫేస్ బుక్ కు ఏదో ఒక చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. తరచూ ఈ ప్రముఖ సోషల్ మీడియా ఖాతాకు చెందిన డేటా బయటకు లీక్ కావటం..పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావటం తెలిసిందే. తాజాగా ఫేస్ బుక్ మరోసారి హ్యాకింగ్ కు గురైంది తాజాగా చోటు చేసుకున్న డేటా బ్రీచ్ లో బాధితుడిగా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిలవటం గమనార్హం. అంతేకాదు.. అతగాడికి సిగ్నల్ లో ఖాతా ఉందన్న విషయం బయటకు వచ్చింది. అతని ఫోన్ నెంబరు కూడా లీక్ కావటం షాకింగ్ గా మారింది.
ఫేస్ బుక్ లో 533 మిలియన్ల ఫేస్ బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు వెల్లడైనట్లు, ఇందులో 60 లక్షల మంది భారతీయ వినియోగదారులున్నట్లు చెబుతున్నారు. అమెరికాకు చెందిన 32 మిలియన్లు.. యూకేకు చెందిన యూజర్లు 11 మిలియన్ల మంది ఉన్నట్లుగా తేలింది. డేటా లీక్ బాధితుడిగా మార్క్ జుకర్ బర్గ్‌తో పాటు.. ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకులు డస్టిన్ మోస్కో విట్జ్.. క్రిస్ హ్యూస్ కూడా ఉండటం విశేషం.
తాజాగా లీక్ అయిన జుకర్ బర్గ్ డేటాకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. జుకర్ ఫోన్ నెంబరు లీక్ కావటంతో పాటు..అతని వ్యక్తి వివరాలతో సహా అన్ని లీక్ కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అయితే.. దీనిపై స్పందించిన ఫేస్ బుక్ ఇదంతా పాత డేటా అని.. 2019 ఆగస్టులో తాము ఈ లోపాన్ని సరిదిద్దినట్లుగా పేర్కొంది. మార్క్ జుకర్ బర్గ్ కు సంబంధించిన సిగ్నల్ ఖాతాకు సంబంధించిన.. స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.