శిద్దా రాఘవరావు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 2014లో విజయం సాధించారు. ఆ వెంటనే చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం కూడా దక్కించుకున్నారు. ఐదేళ్లూ మంత్రిగా కొనసాగారు. మంచి వ్యాపార వేత్త, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో సౌమ్యుడిగా, ప్రజలకు దగ్గరైన నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. దర్శిలో తనదైన రాజకీయం చేసి.. పార్టీని బలోపేతం చేశారు. అభివృద్దికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. నాడు ప్రకాశం జిల్లాలో శిద్ధా ఒక్కరే మంత్రి కావడంతో ఆయనకు తిరుగే లేకుండా పోయింది.
అయితే.. గత 2019 ఎన్నికల్లో ఆయన మరోసారి దర్శి నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. దీనికి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. టికెట్ కూడా ఆయనకేనని చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇంతలోనే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం స్థానం నుంచి ఆయన బరిలోకి దిగాల్సి వచ్చింది. సరే.. మారిన రాజకీయ పరిణామాలతో శిద్దా కూడా అక్కడ నుంచి పోటీకి దిగారు. అయితే.. వైసీపీ సునామీ లో ఆయన ఓడిపోయారు. తర్వాత.. టీడీపీలోనే కొన్నాళ్లు ఉన్నప్పటికీ.. వైసీపీ సర్కారు దూకుడుతో శిద్దా వ్యాపారాలపై ప్రబావం పడడంతో శిద్దా.. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరిపోయారు.
ముందుగా శిద్ధా అన్న కుమారులు.. తర్వాత కుమారుడితో కలిసి శిద్ధా రాఘవరావు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. సో.. ప్రస్తుతం శిద్ధా కుటుంబ సభ్యులంతా వైసీపీలోనే ఉన్నారు. అయితే.. మాజీ మంత్రి కావడం, నియోజకవర్గంలో ప్రజలు ఈయనపై ఇప్పటికీ ఆశలు పెట్టుకోవడం, వైశ్య సామాజిక వర్గంలోనూ మంచి గుర్తింపు ఉండడంతో ఆయా వర్గాల వారు ఇప్పటికీ శిద్దా వద్దకు ఏదో ఒక పనిపై వస్తున్నారు. కానీ, శిద్దా చేతిలో ఎలాంటి పదవీ లేదు. పోనీ.. వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామంటే.. ప్రస్తుతం అవీ ఖాళీగా లేవు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉన్నారు. అక్కడ సీటు ఖాళీగా లేదు. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు.
ఈయనను మారుస్తారులే.. పోనీ.. ఇక్కడ ట్రై చేసుకుందామంటే.. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి రెడీగా ఉన్నారు. దీంతో అటు ఎంపీ స్థానం, ఇటు ఎమ్మెల్యే స్థానంలోనూ అవకాశం లేక.. శిద్దా గోళ్లు గిల్లుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఏదైనా నామినేటెడ్ పదవైనా ఇవ్వండి సార్.. అంటూ.. వైసీపీలో నేతలకు శిద్దా నిత్యం ఫోన్లు కొడుతున్నారని తెలుస్తోంది. అయితే.. పార్టీలోకి తీసుకున్నారే కానీ..శిద్దాను పట్టించుకునే తీరిక ఇప్పుడు వైసీపీలో ఎవరికీ లేకపోవడంతో శిద్దా.. ఆయన కుటుంబం కూడా తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఇక, ఈ పరిణామాలను గమనిస్తున్న టీడీపీ నాయకులు… “శిద్దా సార్ పొలిటికల్ పులుసులో ముక్కయిపోయారే !“ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.