‘ప‌థ‌కం’ పారడం లేదా... త‌ల‌ప‌ట్టుకున్న జ‌గ‌న్ స‌ర్కారు

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌కు గుర‌వుతోంది. మ‌నం ఒక‌టి అనుకుంటే.. మ‌న‌కు మ‌రొక‌టి ఎదు ర‌వుతోందేంటి? అని త‌ల‌పట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాలి? అనే ఆలోచ‌న‌లో త‌మ స‌ర్కారు త‌ల‌మున‌క‌లైంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. తాము చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేసే ప‌థ‌కాల ద్వారా వ‌చ్చే ల‌బ్ధిని త‌మ‌కు అనుకూల ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాయి. వాటిపైనే ఫోక‌స్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. ఏ ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టినా.. ప్ర‌జ‌ల‌కు ఏ రూపాయి అందించినా.. దాని నుంచి ఓట్ల రూపంలోనో.. సింప‌తీ రూపంలో త‌మ‌కు ప్రయోజ‌నం క‌ల‌గాల‌ని భావిస్తాయి.

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా తాము ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు, అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ద్వారా ఇలాంటి సింప‌తీని, ఓటు బ్యాంకును ఆశిస్తోంది. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేద‌ని సీఎం జ‌గ‌న్ చెబుతున్న పేద‌ల‌కు ఇళ్ల పంపిణీ కార్య‌క్ర‌మం ద్వారా చాలానే ఆశించారు వైసీపీ నాయ‌కులు. అదేవిధంగా ఇత‌ర ప‌థ‌కాలైన అమ్మ ఒడి త‌దిత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా కూడా ప్ర‌జ‌ల సింప‌తీని కోరుకు న్నారు. మ‌రీముఖ్యంగా స్థానిక ఎన్నిక‌ల్లో ఆయా ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధి పొందాల‌ని కూడా ప్ర‌భుత్వం త‌ల‌పోసింది. అయితే.. ఈ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి, అమ‌లు చేస్తున్న క్ర‌మంలో దాదాపు రాష్ట్ర ప్ర‌జ‌ల ఆలోచ‌న, వారి ఫోక‌స్ అంతా కూడా దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ప‌డింది.

దీంతో ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల క‌న్నా కూడా.. మెజారిటీగా ఉన్న‌ హిందూ ప్ర‌జ‌లు ఆరాధించే దేవుళ్ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న వ‌రుస దాడుల‌తో ప్ర‌జ‌ల ఫోక‌స్ అంతా అటు వైపే మ‌ళ్లింది. దీని వెనుక ఎవ‌రి ప్ర‌మేయం ఉందో అన్న విషయం పక్కన పెడితే... జగన్ మతం హిందు మతం కాకపోవడం వల్ల కొందరు  ప్రజలకు కొన్ని అనుమానాలు అయితే కలగడానికి ఈ దాడులు కారణం అవుతున్నాయి.  ప్ర‌భుత్వం ఆశించిన మేర‌కు ఆయా ప‌థ‌కాల‌కు సంబంధించిన మైలేజీ రాలేద‌నే చెప్పాలి. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి?  ప్ర‌జ‌ల ఫోక‌స్‌ను ఎలా త‌మ‌వైపు తిప్పుకోవాలి?  మ‌రీ ముఖ్యంగా స్థానిక ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసిన స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఏవిధంగా మెప్పించాలి? అనేది వైసీపీ ముందున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ప్ర‌స్తుతం ఏ ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు క‌లిసినా.. ఫోన్లు చేసుకున్నా.. ఇదే విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే స్థానిక ఎన్నిక‌ల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు వాయిదా వేయించాల‌నేది వైసీపీ నేత‌ల ఆలోచ‌న‌‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌తో మ‌ళ్లీ ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో దూకుడు చూపించేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి ఇప్పుడు ప్ర‌భుత్వానికి గ్రాఫ్ క‌నుక బాగానే ఉండి ఉంటే.. స్థానికంపై ముందుకు వెళ్లి ఉండేవార‌మ‌ని, కానీ.. ప‌రిస్థితి అ‌నుకూలంగా లేకపోవడంతో విభేదించ‌క త‌ప్ప‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌ల అంత‌ర్గ‌త సంభాష‌ణల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.