సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ గడప తొక్కిన అందాల భామ శ్రుతి హాసన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. కెరీర్ స్టార్టింగ్‌లో ఫ్లాపులను ఖాతాలో వేసుకుని ఐరన్ లెగ్గా ముద్ర వేయించుకుంది.
అయితే ఎన్ని అవమానాలు ఎదురైనా, మరిన్ని విమర్శలు వచ్చినా కృంగిపోకుండా ముందడుగు వేసిన శ్రుతి హాసన్.. `గబ్బర్ సింగ్`తో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఈమె `శ్రీమంతుడు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని.. మళ్లీ `క్రాక్`తో రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో శ్రుతి హాసన్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. గత నెలలో శ్రుతి రెండో సారి కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే కరోనాను జయించినా ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఇటీవల పేర్కొన్న ఆమె.. తాజాగా తాను అనుభవిస్తోన్న మరో బాధ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ శ్రుతి హాసన్‌ను వేధిస్తున్న సమస్య మరెదో కాదు నిద్రలేమి. దీని కారణంగా పాపం ఆమెకు రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదట. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఓ విచిత్రమైన పిక్‌ను షేర్ చేసింది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `సలార్` చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. అలాగే గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబోలో రూపుదిద్దుకుంటున్న `ఎన్బీకే 107`లో హీరోయిన్గా చేస్తోంది. వీటితో పాటు బాబీ డైరెక్ట్ చేస్తున్న `మెగా 154`లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.