తాజాగా ఒక వార్త ఇంటర్నెట్లో జోరుగా వైరల్ అవుతోంది. అది వరదలు, వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించడంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులకు సంబంధించిన వార్తే. ఇప్పుడు ఈ వార్తను లింకు చేసి.. చంద్రబాబుకు జోడించి.. ఆయన కూడా ఇలా మారితేబెటరేమో.. అన్న కామెంట్లు వినిపిస్తు న్నాయి. ఎందుకంటే.. గత నాలుగు రోజులుగా ఏపీలోని చాలా జిల్లాలు వరదలో మునిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా వరదల్లో తిరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
అసలేం జరిగింది?
ఉత్తర కొరియా దేశంలో జూలై, ఆగస్టు మధ్య దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో(ప్రావిన్స్) భారీ వర్షాలు కురిశాయి. అయితే.. ముందస్తు చర్యలు చేపట్టడంలోనూ.. వరదలు వచ్చాక సహాయక చర్యల్లోనూ కొందరు అధికారు లు అలసత్వం ప్రదర్శించారు. అయితే.. అది పెద్ద అలసత్వమేమీ కాదు.. అక్కడ కురిసిన వర్షాల రేంజ్ అలా ఉంది. అయినా.. అధికారులు చర్యలు చేపట్టారు. కానీ, ఈ విపత్తులో సుమారు 4 వేల మంది ప్రజలు మృతి చెందారు. ఇదేసమయంలో 40వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కానీ, ఇంత జరిగినా.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఆగ్రహించారు. అధికారుల అలసత్వం తోనే ఇంత నష్టం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు.. 30 మంది అధికారులకు మరణ శిక్ష వేసేశారు. అయితే.. ఈ వ్యవహారం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా..ఏపీలో వరదలు ముంచెత్తుతున్న సమయంలోను.. ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని.. సీఎం చంద్రబాబు చెబుతున్న సమయంలోనే ఈ వార్త వెలుగు చూడడంతో నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు.
చంద్రబాబు కూడా కిమ్ మాదిరిగా వ్యవహరించాలా? అని ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. ఏపీలోనూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చంద్రబాబే స్వయంగా చెబుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్డునే అప్పగించినా.. ప్రజలకు సాయం చేయలేకపోతున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు షాక్ ట్రీట్మెంటే ఇవ్వాలన్నది నెటిజన్ల మాట.