ఏపీలో గంజాయి వ్యవహారం కొంతకాలంగా పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో ఏపీలో గంజాయి రవాణా భారీగా పెరిగిందని, ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడ్డా…దాని మూలాలు ఏపీలో దొరుకుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలు చేశారన్న కారణంతో టీడీపీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడం, దానిని జగన్ సమర్థించడం కలకలం రేపింది.
అంతేకాదు, తమను తాము కప్పిపుచ్చుకునే క్రమంలో అసలు ఏపీలో పట్టుబడుతోన్న గంజాయి ఏపీది కాదని, విశాఖ ఏజెన్సీలో గంజాయిని సమూలంగా నాశనం చేశామని, ఎక్కడో అడపాదడపా చిన్నా చితకా పరిమాణాల్లో గంజాయి దొరికిందని పోలీసులు, వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారికి షాకిచ్చేలా ఏపీలో గంజాయి వ్యవహారంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఏపీలో గంజాయికి సంబంధించిన సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీలో గత మూడేళ్లలో పట్టుబడుతున్న గంజాయి పరిమాణంతో పోలిస్తే ఈ ఏడాది పట్టుబడ్డ గంజాయి పరిమాణం 3 రెట్లు పెరిగిందని వెల్లడైంది. ఈ ప్రకారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. 2018లో 33,930.5 కిలోల గంజాయి, 2019లో 66,665.5 కిలోల గంజాయి పట్టబడగా…గత ఏడాది ఆ పరిమాణం మూడు రెట్లు పెరిగి 1,06,042.7 కిలోలలకు చేరడం సంచలనంగా మారింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు రాయ్ సమాధానమిస్తూ ఈ గణాంకాలు సభ ముందు వెల్లడించారు.
తాజాగా రాజ్యసభలో వెల్లడైన గణాంకాలతో ఏపీ పరువు రాజ్యసభలో పోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లక్ష కిలోల గంజాయి ఏపీలోనే పట్టుబడితే…పక్క రాష్ట్రాల్లో పట్టుబడ్డ ఏపీ గంజాయి ఇంకెంతుంటుందోనని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గంజాయి హబ్ గా మారిందని, ఇకనైనా కఠిన చర్యలు తీసుకొని ఏపీ పరువు కాపాడాలని అంటున్నారు.