కేరళలోని అలంపూర్ లో జరిగిన జంట హత్యలు, నరమాంసం భక్షణ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా లాభాలు వస్తాయన్న ఆశతో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారన్న ఆరోపణలు కేరళ ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. తాంత్రికడు రషీద్ అలియాస్ మహమ్మద్ షఫీ చెప్పిన చెప్పుడు మాటలు విని భగవత్ సింగ్, లైలా అనే దంపతులు ఈ హత్యలకు పాల్పడినట్టుగా పోలీసులు వెల్లడించారు.
ఎర్నాకుళంలో లాటరీ టికెట్లు అమ్మి జీవనం సాగించే పద్మ, రోస్లిన్లను భగవత్ సింగ్ దంపతులకు రషీద్ పరిచయం చేశాడు. తనతో శృంగారంలో పాల్గొంటే 15000 డబ్బులు ఇస్తానని ఒకరిని, తనతో కలిసి నీలి చిత్రాలలో నటిస్తే 10 లక్షలు డబ్బులు ఇస్తానని ఇంకొకరిని మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకు వెళ్ళాడు. ఆ తర్వాత భగవత్ సింగ్ దంపతులతో కలిసి పద్మ, రోస్లిన్లను రషీద్ నరబలి ఇచ్చాడు. రషీద్ చెప్పినట్లుగా పద్మను ఐదు ముక్కలుగా, రోస్లిన్ ను 56 ముక్కలుగా కోసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది.
ఇక ఆ శరీర భాగాలలో కొన్నింటిని వండుకొని రషీద్, భగవత్ సింగ్ దంపతులు తిన్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఇద్దరు మహిళలతో పాటు మరికొంతమందిని కూడా నరబలి ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్టుగా విచారణలో వెల్లడింది. వీరిద్దరి కంటే ముందే తిరువళ్లకి చెందిన మహిళను రషీద్ తీసుకురాగా…తాను కేరళకు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులకు ఆమె సమాచారం ఇచ్చింది.
దీంతో ఆమె చనిపోతే కుటుంబ సభ్యులు తమను పట్టుకుంటారన్న అనుమానంతో ఆ మహిళను వారు వదిలేసినట్టుగా తెలుస్తోంది. వీరింటికి మరో కుటుంబాన్ని కూడా రషీద్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ కుటుంబంలో ఓ చిన్నారి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, వారు ఎవరు? ఏమయ్యారు? అన్న విషయంపై క్లారిటీ లేదు.