ఇటీవల కాలంలో ఎప్పుడూ వినని.. చూడని ఘోర రైలు ప్రమాదానికి వేదికగా మారింది ఒడిశా. కొద్ది నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ఢీ కొట్టిన ఈ ఉదంతం వందలాది మంది ప్రాణాల్ని తీయగా.. వెయ్యికి పైగా ప్రయాణికులకు గాయాలకు కారణమైంది. అన్నింటికి మించి.. పట్టాలు తప్పి.. బోగీలు తిరగబడిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఏడు బోగీల కారణంగానే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. తక్కువలో తక్కువ వేసుకున్నా.. ఒక్కో బోగీలు 70 మంది ఉంటారు. అంటే.. దాదాపు 500 మంది ప్రయాణికులు (తక్కువలో తక్కువ)య తిరబడిన 7 బోగీల్లో ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉండటం గమనార్హం. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ లో మొదలై ఒడిశా మీదుగా ఏపీ నుంచి తమిళనాడుకు వెళుతుంది. ఇక.. బెంగళూరు – హోరా ఎక్ప్ ప్రెస్ విషయానికి వస్తే కర్ణాటక నుంచి బయలుదేరే ఈ సూపర్ ఫాస్ట్ రైలు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ వెంటనే తమిళనాడులోకి వెళ్లి.. ఆ తర్వాత ఏపీ నుంచి ఒడిశా మీదుగా పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చేరుకుంటుంది. మొత్తంగా ప్రమాదానికి గురైన ఈ రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉంటారు. 5 రాష్ట్రాలను ప్రభావితం చేసే ఈ ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి.
రాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవటం.. చిమ్మ చీకటి కారణంగా తిరగబడిన రైలుకోచ్ ల నుంచి ప్రయాణికుల్ని బయటకు తీయటం సమస్యగా మారింది. అయినప్పటికీ.. వీలైనంత వేగంగా సహాయక చర్యలు చేపట్టినట్లుగా చెబుతున్నారు. జరిగిన ప్రమాద తీవ్రతతో పోలిస్తే.. అందుతున్న సహాయక చర్యలు తక్కువే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దారుణ ప్రమాదం జరిగిన గంట వరకు ఒక్క అంబులెన్సు రాకపోవటం గమనార్హం. రైల్వే శాఖకు చెందిన సహాయక టీంలు గంట తర్వాతే వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే.. పలువురు ప్రాణాలు కాపాడే వీలు ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే.. స్థానికులు స్పందించి.. వెంటనే రైల్లో ఉన్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
దీనికి సంబంధించిన పలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖతో పాటు వివిధ రాష్ట్రాల వారు హెల్ప్ లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. విశాఖపట్నం 0891-2746330, 0891-2744619 విజయనగరం 0892-2221202, 0892-2221206 శ్రీకాకుళం 0894-2286213, 0894-2286245 ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నంబర్ 06782262286 రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు హౌరా 033-26382217 ఖరగ్‌పూర్ 8972073925 బాలాసోర్ 8249591559 చెన్నై 044-25330952 పశ్చిమబెంగాల్ సర్కారు హెల్ప్‌లైన్ నంబర్లు 033-22143526, 033-22535185.