వైసీపీ ప్రభుత్వం పాలనా రాజధానిగా పేర్కొంటున్న విశాఖపట్నంలో ఏం జరుగుతోంది? జిల్లాలో ఇవాళ జరిగిన వరుస ఘటనలతో విశాఖ వాసులు ఉలిక్కిపడుతున్నారు. ఒక చోట ఆరుగురు.. మరో చోట నలుగురు అనుమానస్పదంగా మొత్తం 10 మంది ఒకే రోజు మృతి చెందడంతో జిల్లాలో అసలేం జరుగుతోంది..? అని జనాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఆరుగురి హత్య కేసులో తాజాగా అందిన సమాచారం మేరకు.. ఆస్తి కోసం జరిగిన వివాదంలో అప్పలరాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. మరోవైపు మృతుల బంధవులు సైతం ఈ హత్యలు ఆస్తి కోసమే జరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం ఘర్షణలు జరుగుతున్నాయని బంధవులు చెబుతున్నారు. హంతకుడు అప్పలరాజును తమ ముందుకు తెచ్చేవరకూ మృతదేహాలను ఇక్కడ నుంచి కదలనివ్వమని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అప్పలరాజును రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇదిలావుంటే, బెహ్రయిన్లో వ్యాపారం చేసుకునే ఎన్నారై కుటుంబం మొత్తం హత్యకు గురైంది. మొత్తం నలుగురు ఉన్న ఈ కుటుంబంలో పెద్ద కుమారుడు తల్లి తండ్రి, సోదరుడుని దారుణంగా హత్య చేసి.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడడం విశాఖలో సంచలనంగా మారింది.
విశాఖపట్నం మిథిలాపురి కాలనీ, అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో 8 నెలల నుంచి ఎన్ఆర్ఐ కుటుంబం నివసిస్తున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్ (22), కశ్యప్ (19)గా పోలీసులు నిర్ధారించారు. అయితే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురి మృతికి కారణం పెద్ద కుమారుడేనని తెలుస్తోంది. ఎన్ ఐటీ చదివిన పెద్దకుమారుడు.. ప్రస్తుతం సివిల్స్ కోసం చదువుతున్నాడు. తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్న ఆయన.. ఇంట్లో గొడవ పడి తల్లిదండ్రులతో పాటు సోదరుడుని కూడా హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం.. తను కూడా ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా మొత్తం పది మంది మృతితో ఒక్కసారిగా విశాఖ ఉలిక్కి పడడం గమనార్హం.