సంగం డెయిరీ లావాదేవీల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ధూళిపాళ్లను అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా…ధూళిపాళ్ల అరెస్టు అక్రమమని మండిపడ్డారు.
మరోవైపు, ధూళిపాళ్ల బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. తాజాగా నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ అధికారులకు షాకిచ్చింది. ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ రద్దు చేయడానికి తగిన కారణాలు కనిపించడం లేదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బెయిల్ రద్దుకు వేసిన పిటిషన్ తిరస్కరణకు గురవడంతో ఏసీబీ అధికారులకు చుక్కెదురైనట్టయింది.
గతంలో సంగం డెయిరీలో పాలనాపరమైన అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు…ధూళిపాళ్లపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ఎండీ గోపాల కృష్ణను అరెస్టు చేశారు. నెల రోజుల తర్వాత ఆ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది. అయితే, ఆ బెయిల్ రద్దు చేయాలంటూ ఏసీబీ అధికారులు హైకోర్టును ఆశ్రయించగా వారికి ఎదురుదెబ్బ తగిలింది.