భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులపాటు ఏపీ తెలంగాణలో పర్యటించేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు మోడీ విశాఖకు చేరుకోబోతున్నారు. రేపు ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మోడీకి ఆహ్వానం పలుకుతూ విశాఖలో భారీ సైజులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జెండాలతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేతలకు విశాఖ మున్సిపల్ శాఖ సిబ్బంది షాక్ ఇచ్చారు. విశాఖలోని సిరిపురం జంక్షన్ ద్రోణం రాజు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బిజెపి జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము మండిపడ్డారు. మీ ఇష్టం వచ్చినట్టు జెండాలు పీకేస్తారా అంటూ సోము మండిపడ్డారు. తమది నేషనల్ పార్టీ అని, ఈరోజు ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాలను ఎందుకు తీసేస్తున్నారని సోము నిలదీశారు.
రెండ్రోజులు జెండాలు ఉంచడం అంత కష్టమైపోయిందా అంటూ అధికారులపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ సిబ్బంది, అధికారులకు….సోమ వీర్రాజు, బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పికప్ ట్రక్కులో వేసిన బిజెపి జెండాలను సోము వీర్రాజు స్వయంగా తీసి తొలగించిన స్థానంలో పెట్టడం విశేషం. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.