రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీకి, నేతలకు తగులుతున్న నిరసన సెగలే ఇందుకు నిదర్శనం. అదే సమయంలో ఏపీలో టీడీపీ బలపడుతూ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమనడానికి ప్రస్తుతం వీస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలే నిదర్శనం.
దీంతో, ఓడిపోబోతోన్న పార్టీ వైసీపీ నుంచి బయటపడేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ప్రచారంతో మరో ఏడాది ఉండగానే ఏపీలో ఎన్నికల సందడి ఏర్పడింది. ఈ క్రమంలోనే నారా లోకేష్ కంచుకోటగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
లోకేష్ సమక్షంలో శ్రీనివాసరావు సైకిల్ ఎక్కబోతున్నారు. శ్రీనివాసరావు చేరిక నేపథ్యంలో మంగళగిరిలో భారీగా టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, అనుమతులు లేవంటూ ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో మున్సిపల్ అధికారులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారుల శైలిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న శ్రీనివాసరావు పార్టీని వీడడం మంగళగిరి వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే. పార్టీలో ముందు నుంచి ఉన్నప్పటికీ తనకు తగిన గుర్తింపు కానీ, సముచిత స్థానం కానీ లభించలేదని శ్రీనివాసరావు అసహనంతో ఉన్నారట.